65 | He Prabhu Yesu | హే ప్రభు యేసు | Calvary Temple

పల్లవి: హే ప్రభు యేసు హే ప్రభు యేసు - హే ప్రభు దేవ సుతా 
సిల్వధరా పాపహరా శాంతికరా

1. శాంతి సమాధానాధిపతి - స్వాంతములో ప్రశాంత నిధి 
శాంతి స్వరూపా జీవనదీపా - శాంతి సువార్త నిధి ॥సిల్వ॥

2. తపములు తరచిన నిన్నే గదా జపములు గొలిచిన నిన్నేగదా
విఫలులు జేసిన విజ్ఞాపనలకు - సఫలత నీవే గదా ॥సిల్వ॥

3. మతములు వెదకిన నిన్నెగదా- వ్రతములు గోరిన నిన్నెగదా 
పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమత నీవేగదా ॥సిల్వ॥

4. పలుకులలో నీ శాంతి కథ తొలకరి వానగ గురిసె గదా 
మలమలమాడిన మానవ హృదయము కలకలలాడెగదా ॥సిల్వ॥

5. కానన తుల్య సమాజములో హీనత జెందెను మానవత 
మానవ మైత్రిని సిల్వ పతాకము - దానము జేసెగదా ॥సిల్వ॥

6. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండెగదా 
దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివిగదా ॥సిల్వ॥

7. పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండెగదా 
దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి నీవెగదా ||సిల్వ॥

8. ఖాళి సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవెగదా 
ఖలమయుడగు సాతానుని గర్వము - ఖండన మాయెగదా ॥సిల్వ॥

9. కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ ప్రవహించె గదా 
కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా ॥సిల్వ॥

Post a Comment

0 Comments